Telugu Updates

Sunday 3 February 2013

ఆర్టీసీలో వివక్ష ‘విశ్వరూపం’

ఆర్టీసీలో వివక్ష ‘విశ్వరూపం’:


-గుర్తింపు సంఘం ఈయూను కాదని..
-ఆకాంక్షను నిలబెట్టిన టీఎంయూను నిరాకరించి
-ఐఎన్‌టీయూసీకి డైరెక్టర్ పదవి
-రాష్ట్రవ్యాప్తంగా 367 ఓట్లే వచ్చినా అందలం
-ఆర్టీసీ పాలకమండలిలో పాలకుల వింత వైఖరి
- నిబంధనలు, జీవోను కాలరాస్తూ నిర్ణయం
- తెలంగాణపై వివక్షతోనే ఈ బరితెగింపు
- పట్టపగలే ప్రజాస్వామ్యంతో పరిహాసం
- మండిపడుతున్న కార్మిక సంఘాలు
హైదరాబాద్, జనవరి 31 (టీ మీడియా):ఆరు దశాబ్దాల సీమాంధ్ర పాలనలో తెలంగాణపై కొనసాగుతున్న వివక్షకు తాజా విశ్వరూపమిది. నలుగురూ నవ్విపోతారన్న సిగ్గూఎగ్గూ మరిచి.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సీమాంధ్ర పాలకులు వింతపోకడలకు తెరతీశారు. తెలంగాణకు దక్కల్సిన న్యాయబద్ధమైన పదవులను నిరాకరిస్తూ.. నిబంధనలను సైతం ఇష్టారాజ్యంగా కాలరాశారు. ఇటీవలి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్- ఎంప్లాయీస్ యూనియన్ కూటమికి.. ఆర్టీసీ పాలక సంస్థలో న్యాయబద్ధంగా దక్కాల్సిన రెండు డైరెక్టర్ పదవులను తిరస్కరించారు. అంతేకాకుండా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి.. 367 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే ఐఎన్‌టీయూసీకి డైరెక్టర్ పదవి కట్టబెట్టారు. దీంతో కార్మిక సంఘాల నేతలు, ఆర్టీసీ తెలంగాణ కార్మికులు భగ్గుమన్నారు. ప్రజాస్వామ్యాన్ని, జీవోలను పట్టపగలే అపహాస్యం పాలు చేసేలా పాలకులు వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీలో కొత్త సంస్కృతిని ప్రవేశపెట్టి సంస్థను నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఎన్నికలతో గుర్తింపులోకి వచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సీపీఐకి అనుబంధం కాగా, టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉండే టీఎంయూ రెండో ప్రధాన సంఘంగా అవతరించింది. ఈ సంస్థలకు డైరెక్టర్ పదవులు కట్టబెట్టడం ఇష్టంలేకనే ప్రభుత్వం బరితెగింపుగా నిబంధనలను కాలరాస్తోందని విమర్శలు వస్తున్నాయి.

ఆర్టీసీ పాలకమండలిలో ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. అందులో ఐదుగురు డైరెక్టర్లు సంస్థలోని ఉన్నతాధికారులు కాగా, ఇద్దరు డైరెక్టర్లను కార్మిక సంఘాల నుంచి నియమిస్తారు. వాస్తవానికి గతంలో అసలు ఆర్టీసీలో కార్మిక సంఘాలకు డైరెక్టర్ పదవి ఉండేది కాదు. అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, ఆర్టీసీలో తరచూ సమ్మెలు, ఆందోళనలు చోటుచేసుకుంటుండటంతో కార్మికుల నుంచి కూడా ఇద్దరిని డైరెక్టర్లుగా నియమించాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌డ్డి జీవో జారీ చేశారు. ఆ జీవోలోని నిబంధనల ప్రకారం సంస్థలోని రెండు ప్రధాన సంఘాలకు చెందిన ఇద్దరిని డైరెక్టర్లుగా నియమించాలి. ఆ సమయంలో ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) గుర్తింపులో ఉంది. రెండో ప్రధాన యూనియన్‌గా ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నిలిచింది. అయితే డైరెక్టర్ పోస్టుకు ఈయూ ఆసక్తి చూపకపోవడంతో ఎన్‌ఎంయూకి చెందిన ఇద్దరు నేతలను డైరెక్టర్లుగా నియమించారు. ఆ తర్వాత జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా ఎన్‌ఎంయూ గెలుపొందడంతో వారిద్దరే డైరెక్టర్లుగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఐక్య కూటమిగా పోటీ చేసి ఎన్‌ఎంయూని చిత్తుగా ఓడించాయి.

ఈయూకు రాష్ట్రస్థాయి గుర్తింపు రాగా, తెలంగాణలోని పది జిల్లాల్లో టీఎంయూకి కార్మికులు బ్రహ్మరథం పట్టారు. టీఎంయూ మద్దతుతో ఈయూ రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది. వాస్తవానికి రెండు డైరెక్టర్ల పదవుల్లో చెరొకరిని నియమిస్తారని కార్మికులు భావించారు. రెండు డైరెక్టర్ల పదవుల్లో ఒకటి ఈయూకి ఇవ్వాలని, మరొకటి అత్యధిక జిల్లాల్లో స్థానిక గుర్తింపు పొందిన తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు ఇవ్వాలని గుర్తింపు సంఘమైన ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ జనవరి 27న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారథి, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌లకు కూడా అందించారు. అయితే ప్రభుత్వం ఎవ్వరూ ఊహించనివిధంగా నిర్ణయం తీసుకుంది. గుర్తింపు పొందిన ఈయూను, అత్యధిక జిల్లాల్లో విజయబావుట ఎగురవేసిన టీఎంయూను పక్కనపె గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 367 ఓట్లు వచ్చిన ఐఎన్‌టీయూసీకి డైరెక్టర్ పదవి కట్టబెట్టింది.

ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎన్‌టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ బీ రాధాకృష్ణయ్యను.. ఇటీవల రాజీనామా చేసిన ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ స్థానంలో నియమించింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారథి జీవో నెంబర్-12 జారీ చేశారు. కార్మికుల కష్టసుఖాలు తెలిసిన కార్మిక సంఘాల్లోని నేతలకు ఇవ్వాల్సిన పదవిని ఆర్టీసీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఎలా కట్టబెడతారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సంస్థలోని రెండు ప్రధాన సంఘాలకు డైరెక్టర్ పదవులు ఇవ్వాలని కచ్చితమైన నిబంధనలు ఉన్నా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాటిని తుంగలో తొక్కి, కనీసం ఐదు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేని సంఘానికి ఎలా పదవి కేటాయిస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గెలిచిన వాళ్లు అనుకూలంగా లేరనే: పద్మాకర్
గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన ఎంప్లాయీస్ యూనియన్ తనకు అనుకూలంగా ఉండబోదని భావించే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందని ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఆరోపించారు. సంస్థలోని రెండు ప్రధాన సంఘాలకు చెందిన వారినే డైరెక్టర్ స్థానాల్లో నియమించాలని ఉన్న నిబంధనలను కూడా పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర గుర్తింపు పొందిన తమ సంఘానికి, అత్యధిక జిల్లాల్లో గుర్తింపు పొందిన సంఘానికి డైరెక్టర్ పదవులు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశానని, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు.

రాజకీయ నాయకులకు ఇస్తారా?: అశ్వత్థామడ్డి
కార్మికుల సమస్యలు తెలిసిన కార్మిక నాయకులను కాదని, రాజకీయ నాయకులను డైరెక్టర్ పదవిలో ఎలా నియమిస్తారని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామడ్డి ప్రశ్నించారు. గతంలో ఆర్టీసీలో గెలుపొందిన గుర్తింపు సంఘానికే డైరెక్టర్ పదవులు కట్టబెట్టి, ఈసారి అద్భుత విజయం సాధించిన ఈయూ-టీఎంయూ కూటమిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీఎంయూ ఆవిర్భవించిన కొద్ది నెలల్లో ఆర్టీసీలో ప్రకంపనలు సృష్టించిందని గుర్తుచేశారు.

No comments:

Post a Comment

Chitika Ads